జనసేనాని ఇంటర్వ్యూ

కేసీఆర్‌ రిటర్న్‌గిఫ్టు.. చంద్రబాబుకు గిఫ్టు కావొచ్చు

కావాలనుకుంటే కేసీఆరే పోటీ చేయొచ్చు కదా..!
కేసుల భయంతో జగన్‌ కేంద్రానికి లొంగి నోరెత్తడం లేదు
కాంగ్రెస్‌కు మారు రూపమే వైకాపా
అనుభవజ్ఞుడని చంద్రబాబుకు మద్దతిస్తే.. దోపిడీకి ఉపయోగపడింది
వైకాపా, తెదేపాలతో పొత్తులపై నా మీద ఒత్తిళ్లొచ్చాయి
ఆ రెండు పార్టీలకు జనసేన సమాన దూరం
తక్కువ అవినీతి, ఎక్కువ పారదర్శకత ఉన్న వారికే ఓటు వెయ్యాలి
‘ఆంధ్రా రాజకీయాల్లోకి కేసీఆర్‌ రావాలనుకుంటే నేరుగా వచ్చి ఎన్నికల్లో పోటీ చెయ్యాలి. చంద్రబాబుకు ‘రిటర్న్‌ గిఫ్టు’ ఇస్తామంటున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే అది ఆయనకు గిఫ్టు కావొచ్చన్న అభిప్రాయం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విద్వేషాలు తొలగి సుహృద్భావ వాతావరణం ఏర్పడాలనేదే నా అభిమతం.’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. ‘ఆంధ్రా పెత్తందార్లు వద్దంటూ ఉద్యమం చేసి.. తిరిగి వారినే పెంచుతామంటే ఎలా..? అని ప్రశ్నించారు. పెత్తందార్లను బెదిరించి ఇక్కడ రాజకీయం చేస్తామంటే రానున్న రోజుల్లో తెలంగాణలో ప్రాబల్యం చూపిస్తారు’ అని హెచ్చరించారు. కొంతకాలం కిందట జనసేనలో చేరతామని వచ్చిన నాయకులు హైదరాబాద్‌లో ఆస్తులున్నాయని వెనక్కి తగ్గారు. ఆ వ్యవహారం అప్పట్లో అర్థం కాకపోయినా ఇప్పుడు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. కోడికత్తితో చిన్న దాడికే అంత హడావుడి చేసిన ప్రతిపక్ష నాయకులు.. సాక్షాత్తూ జగన్‌ చిన్నాన్న హత్యకు గురైతే తొలుత ఎందుకు మౌనం వహించినట్టు అని నిలదీశారు. ప్రస్తుత రాజకీయాలతో ప్రజలంతా విసిగిపోయారు. ప్రజలు ఆ రెండు పార్టీల వైఖరిని చూశారు.. ఇప్పుడు మార్పునకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ‘ఈనాడు-ఈటీవీ’ ప్రతినిధులకు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... 
ప్రతిపక్ష నేత బలంగా ఉంటే పాలకులు దోపిడీ చేసే వీలుండదు. ఈ విషయంలో జగన్‌ విఫలమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటే కొన్ని సమస్యల్ని అయినా లేవనెత్తి పరిష్కరించగలిగే వారు. ఆ పని చేసుంటే ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. నిజానికి ప్రతిపక్షమంటే ప్రతి దానికీ ఘర్షణ పడక్కర్లేదు. కొన్నిసార్లు పాలకుల తప్పుల్ని చెండాడాలి, అలాగే వాళ్లు చేసిన మంచి పనిని చెప్పాలి కూడా. లేకపోతే తప్పవుతుంది. బంగ్లాదేశ్‌ విమోచనప్పుడు పాకిస్థాన్‌తో యుద్ధ సమయంలో ఇందిరాగాంధీని అపర దుర్గగా అభివర్ణించిన వాజపేయీనే ఆ తర్వాత ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆమెపై పెద్ద ఉద్యమం చేశారు. విపక్ష నేతగా జగన్‌ కూడా అలా ఉండాల్సింది. అసలు జగన్‌, చంద్రబాబులిద్దరి మధ్యా ఉన్నవి పంపకాల గొడవలు తప్పించి పరిపాలనా పరమైనవి కాదనుకుంటున్నాను. కాంట్రాక్టులు ఎవరికిచ్చావు, ఏ పని ఎవరు చేస్తున్నారనే ఘర్షణ తప్ప... ఉద్యోగ నియామకాల గురించో, సాగునీటి ప్రాజెక్టుల గురించో కాదు. ప్రజల హృదయానికి దగ్గరయ్యే అవకాశమున్నా జగన్‌ వృథా చేసుకున్నారనిపిస్తోంది. నిజానికి నేనేం సభలో లేను. అయినా ఉద్దానంలాంటి కొన్ని సమస్యలనైనా పరిష్కరించే ఒత్తిడి తేగలిగాను. సభలో ఉండి ఉంటే ఇంకా చాలా పనులు చేయగలిగే వాడిని. 

ఓట్లేసే ముందు అన్నీ బేరీజు వేసుకోవాలి! 
ఓట్లు వేయడానికి ముందు ప్రజలు రాజకీయంగా అన్నీ బేరీజు వేసుకోవాలి. తెదేపా, వైకాపా, జనసేన, సీపీఐ, సీపీఎం.. ఇలాపార్టీల పనితీరు ఎలా ఉందో సమీక్షించుకోవాలి. ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన మేలు, కీడు, నేరాలు, ఘోరాలు.. అన్నీ చూడాలి. ఎవరు తక్కువ అవినీతిపరులు, ఎవరెక్కువ పారదర్శక పాలన అందిస్తారన్నది చూసుకోవాలి. అలా చేస్తేనే పార్టీలు, ప్రభుత్వాలు ప్రజల పట్ల బాధ్యతగా ఉంటాయి. 
చంద్రబాబుదంతా సమయానుకూల విధానం 
విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు బలమైన దెబ్బ తగిలింది. చట్టం, హామీల మేరకు మనకు రావాల్సినవి రాలేదు. ఈ విషయంలో అంతా ఎవరికి అనుకూలమైన ఆట వాళ్లు ఆడారు. తెదేపా తొలి నాలుగేళ్లూ కేంద్రంలో భాజపాతో కలిసుంది. దాంతో వాళ్లు బహిరంగంగా మాట్లాడలేక పోయారు. ముఖ్యమంత్రిది అంతా సమయానుకూల విధానం. దీన్ని ప్రశ్నించాల్సింది విపక్ష వైకాపా... దాని నేత జగన్‌. కానీ ఆయనపై కేసులున్నాయి, పైగా అవన్నీ కేంద్రం పరిధిలో ఉన్నాయి కాబట్టి వాళ్లు భయపెడుతుంటారు. దీంతో ఆయన నోరు మెదపలేదు. కేంద్రంలోని భాజపా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇచ్చేసుకుంది. మన పార్టీల విధానమే వారికి ఉపయోగపడింది. దీనివల్ల నష్టపోయింది ఆంధ్ర ప్రజలే! నేను గత ఎన్నికల్లో తెదేపా, భాజపాలతో కలిసి పనిచేశాను కనుక నాక్కూడా నైతికంగా మాట్లాడే హక్కు లేదు. మొదటి ఆర్నెల్లు ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు. తర్వాత ఎందుకు చేయటం లేదుని అడిగితే ఇదిగో అదిగో అన్నారు. అలాగే రెండున్నరేళ్లు ఐపోయింది. అప్పుడు నేను ప్రశ్నించడం మొదలు పెట్టాను. ప్రజాక్షేత్రంలో ఉండి ఎంత మాట్లాడగలనో అంతా మాట్లాడాను. అందుకే ఇప్పుడు నేను వారితో జట్టు కట్టటం లేదు. మర్యాదగా నమస్కారాలు పెడతాం అంతే. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విభజన హామీలపై గట్టిగా మాట్లాడతా. భాజపా ఐఐఎం, ఐఐటీ.. ఇలా చాలా ఇచ్చానని చెబుతోందిగానీ అవన్నీ తాత్కాలికంగా వేరే సంస్థల ప్రాంగణాల్లో పెట్టారు. విద్యాసంస్థలను ఇవ్వటమంటే ఇలానా? ఏదైనా ప్రశ్నిస్తే రాష్ట్రం లెక్కలు చెప్పడం లేదంటారు! అదే నిజమైతే అవసరమైన చర్యలు తీసుకోవాలి కదా? మాకు సంబంధం లేదని వదిలేస్తే ఎలా? ఆంధ్రప్రదేశ్‌ ఈ దేశంలో భాగం కాదా? ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఘర్షణపడుతుంటే ప్రధానమంత్రి సర్దుబాటు చెయ్యక్కర్లేదా? ఇలాగైతే దేశ సమగ్రత ఎలా కాపాడతారు? 
హత్య జరిగితే గుండెపోటు అంటారా...! 

మీ బాబాయి హత్యకు గురయ్యారు... మృతదేహాన్ని చూస్తే అది హత్యనే అర్థమవుతోంది. అయినా దాన్ని మధ్యాహ్నం వరకూ  ఎందుకు దాచిపెట్టినట్లు? ఇంట్లో మనిషి చనిపోతే అంత గోప్యత ఎందుకో నాకర్థం కాలేదు. ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడే అలా చేసి ఉంటాడని ఎవరూ అనడం లేదు. కానీ ఒక హత్య జరిగినప్పుడు అంత సందిగ్ధత ఎందుకు? ఏమీ జరగలేదు అనడం ఏమిటి? దీన్ని పోలీసులే దర్యాప్తు చేస్తారని చెప్పి వదిలేస్తే చాలు కదా. అది దారుణ హత్య అయితే గుండెపోటుతో మరణించారని చెబితే ఏమనిపిస్తుంది? ఆయనకు సంబంధం లేకున్నా విపరీత అనుమానాలకు దారి తీస్తుంది. ఈ విషయంలో జగన్‌ స్పష్టతతో ఉంటే బాగుండేదనిపిస్తోంది. హత్యా రాజకీయాలు చేసే వారు పాలనలోకి వస్తే ఏమవుతుందోననే భయం కలుగుతోంది. విశాఖలో కోడికత్తితో దాడి చేసినప్పుడు అంత హడావుడి చేసిన మీరు.. ఇంట్లో చోటు చేసుకున్న ఇంత పెద్ద ఘటనపై ఎందుకంత మౌనంగా ఉన్నారు? నా సూచన ఏమంటే... తెదేపా, వైకాపా నాయకత్వాలను పరిశీలించండి. విశాఖపట్నంలో భూకుంభకోణం జరిగింది... వేల కోట్ల రూపాయలు దోచేశారన్నారు... ప్రభుత్వం సిట్‌ వేసింది. మరి ఆ నివేదికను బయటపెట్టకుండా ఎందుకు దాచినట్టు? అంటే చంద్రబాబుకు ఏదో ఇబ్బంది ఉందనేగా!
మమ్మల్ని వైకాపా ఎప్పుడూ గుర్తించలేదు
జగన్‌ దృష్టిలో పవన్‌కల్యాణ్‌ అనే వ్యక్తి లేరు. ఓ గదిలో ఏనుగు తిరుగుతున్నా దాన్ని గుర్తించకూడదనుకుంటే గుర్తించరు కదా! గోడ కనబడుతున్నా అక్కడేం లేదనుకునే వాళ్లకు ఏం చెబుతాం. జనసేనను గుర్తించకూడదన్న వ్యూహం వైకాపాది. నిజానికి ఆ పార్టీ నేతలకు నేను వ్యక్తిగతంగా కూడా సహకరించా. 2014 ఎన్నికల్లో తెదేపా తరఫున కర్నూలు జిల్లాలో ప్రచారం చెయ్యాల్సి ఉంది. కానీ అంతలో వైకాపా తరఫున పోటీ చేసిన భూమా నాగిరెడ్డి ఫోన్‌ చేశారు. తన భార్య మృతి చెందిందని, ఇక్కడికి ప్రచారానికి రావొద్దని కోరారు. నేను వెళ్లలేదు. వాళ్లకు మానవత్వంతో సాయం చేశా.
భాజపాలో చేరాలని ఒత్తిడి తెచ్చారు
ప్రాంతీయ పార్టీలను చంపెయ్యాలన్నది భాజపా లక్ష్యం. గతంలో కాంగ్రెస్‌ ఇలాగే వ్యవహరించింది. ఓ పార్టీని నిర్వహించడం కష్టమని భయపెడుతూ భాజపాలో చేరాలంటూ రకరకాల మార్గాల్లో మూడునాలుగేళ్లు నాపై ఒత్తిడి తెచ్చారు. వాళ్లలో చేరేట్లయితే నేను పార్టీ పెట్టటమెందుకు? ఇంత కష్టపడటమెందుకు?
డ్రాయింగ్‌ రూమ్‌ పొత్తులు బయటకొచ్చాయి
వైకాపా, తెరాస మధ్య డ్రాయింగ్‌ రూమ్‌లో జరిగిన పొత్తు చర్చలు ప్రజల మధ్యకొచ్చేశాయి. కేసీఆర్‌ చంద్రబాబుకు ‘రిటర్న్‌ గిఫ్ట్‌’ ఇవ్వాలనుకుంటే ఆంధ్రాకొచ్చి పోటీ చెయ్యాలి. లేదా జగన్‌తో కలిసి పోటీ చెయ్యాలి. అది ప్రజాస్వామ్య పద్ధతి. ఆ హక్కు ఆయనకుంది, దాన్ని ఆయన వినియోగించుకుంటే స్వాగతిస్తా. ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని నేను దగ్గరి నుంచి చూస్తున్నప్పుడు కేసీఆర్‌ ఇస్తానంటున్న రిటర్న్‌ గిఫ్ట్‌.. ఇప్పుడు చంద్రబాబుకు గిఫ్ట్‌గా మారుతోందని అనిపిస్తోంది. ఇద్దరు వ్యక్తుల మధ్య కోపాన్ని కోట్లమంది ప్రజల మధ్య ద్వేషంగా ఎందుకు మారుస్తున్నారు..? దశాబ్దాలుగా పాలకులు చేసిన తప్పులకు ప్రజలను ఎందుకు శిక్షిస్తారు..? భావోద్వేగాలు రేపటం ఎందుకు..? పెద్ద నాయకులే ఇలా చేస్తే సమాజం విచ్ఛిన్నం కాదా. పదేళ్లు ఇలాంటి ఉద్వేగాలతోనే గడిచాయి. విసిగిపోయాం. ఈ విషయంలో నాదీ సామాన్యుల అభిప్రాయమే. నాయకులు సహృద్భావంతో ఉంటే ఎంత పెద్ద శత్రుదేశాలైనా దగ్గరవుతాయి. ఎవరికీ అన్యాయం చెయ్యకుండా మనదైన పద్ధతిలో పని చేయటమే నా విధానం. కమ్యూనిజం కోరుకునేదీ అదే.
జగన్‌తో కలిసి పోటీ చేయాలన్నారు...
వైకాపాతో పొత్తు గురించి నాతో ఎవరూ నేరుగా మాట్లాడలేదుగానీ.. చంద్రబాబుపై మీకెంత కోపముందో, జగన్‌కూ అంతే ఉందని... మీరిద్దరూ కలవాలంటూ చాలామందితో చెప్పించారు. తెలంగాణ నుంచి కొంతమంది స్నేహితులూ నాతో మాట్లాడుతుంటారు. జగన్‌, మీరూ ఒకే వయసువాళ్లు, ఇప్పుడు కలిసి పోటీ చేసి తెదేపాను రాజకీయ చిత్రపటం నుంచి తొలగిస్తే... ఆ తర్వాత మీరూమీరూ తేల్చుకోవచ్చని సూచించారు. ఇవి మరీ చిన్నపిల్లల ఆలోచనల్లా ఉన్నాయి. నేనలాంటి పిచ్చి లెక్కలు వేయను... అలాంటి రాజకీయాలు చేయను. అంశాల వారీగా చూడాలనేది నా ఉద్దేశం. జగన్‌పై గతంలో నా అభిప్రాయాలను బలంగా చెప్పా. వాటిని వెనక్కెలా తీసుకోగలను?
ఇద్దరూ ఇద్దరే.. 

జనం మా వైపే చూస్తున్నారు
రాష్ట్రంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో దళితులు, ముస్లింలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. వాళ్లు భాజపా వైపు వెళ్లరు. జగన్‌ వైపు వెళ్దామంటే ఆయనేమో భాజపా, తెరాస చేతుల్లో కీలుబొమ్మ. తెదేపా వైపు వెళ్దామంటే చంద్రబాబు ఎప్పుడు మాట మార్చి భాజపాకు మద్దతిస్తారోనని భయం. ఈ పరిస్థితుల్లో వాళ్లంతా బీఎస్పీ, వామపక్షాలు, జనసేనతో కూడిన మా కూటమి వైపే చూస్తున్నారు.
నాది తటస్థ వైఖరి
ఒక సగటు మనిషి ఎలా మాట్లాడతారో నేను అలాగే మాట్లాడతా. అది ఒక పార్టీకి అనుకూలంగా ఉండవచ్చు. మరో పార్టీకి వ్యతిరేకంగా ఉండొచ్చు. అంతమాత్రాన ఓ రోజు ఆ పార్టీతో వెళ్తున్నానని.. మరోరోజు మరో పార్టీతో వెళ్తున్నానని అర్థం తీసి మాట్లాడితే ఎలా..? అప్పట్లో తెలుగుదేశం నాయకుడొకరు.. జగన్‌మోహన్‌రెడ్డి తల్లిపై ఏదో విమర్శలు చేస్తే నేను ఖండించాను. అంత మాత్రాన వైకాపాకు అనుకూలంగా మాట్లాడినట్లు కాదు కదా..! నేను తటస్థంగా ఉండే మనిషిని. ఏది సరైనదని నమ్మితే అదే చెబుతా.
బెదిరించి లొంగదీసుకోలేరు
కొన్ని నెలల కిందట కొంతమంది జనసేనలో చేరతామని చెప్పి.. తర్వాత వైకాపాలోకి వెళ్లారు. ఎందుకు.. అని ఆరా తీస్తే ‘మాకు హైదరాబాద్‌లో ఆస్తులున్నాయి, వాటితో సమస్యలున్నాయి’ అనేవారు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు.. ఇప్పుడు తెలుస్తోంది. ప్రజాస్వామ్యాన్ని బతికించే విధానం ఇది కాదు. బెదిరిస్తే డబ్బున్న వాళ్లు పది మంది భయపడొచ్చేమో కానీ సాధారణ వ్యక్తులు భయపడరు. నాయకుడు ప్రజల్ని ప్రేమించాలే తప్ప బెదిరించి లొంగదీసుకుంటే.. మహా అయితే కొన్నేళ్లు పరిపాలించగలడు.
రాజధానికి అంత భూమి ఎందుకు?
రాజధాని అంటే ఏం కావాలి? పాలనా భవనాలు కావాలి. అందుకు చిన్న రాజధాని చాలు. హైదరాబాద్‌ పోయింది కాబట్టి అలాంటి నగరమే నిర్మించుకోవాలంటే ఎలా? అందుకు ఎన్ని వేల ఎకరాలు కావాలి..? హైదరాబాద్‌ను కోల్పోవడమంటే కోపం సహజమే. కానీ ఇక్కడ పంట భూమి తీసుకున్నారు. రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఒక స్థాయికి మించి చేసిందా.. అని అందరితోపాటు నాకూ అనిపించింది. సహజంగా మన అవసరాలకు తగ్గట్టుగా విస్తరించుకుంటూ పోతుంటే అభివృద్ధి అదే జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కొంత ఆశ తగ్గించుకుని ఉంటే.. ఇన్ని గొడవలు ఉండేవి కావు.
నాకు రహస్యాలేం లేవు... 

నాకు రహస్యాలేం లేవు. బాధ్యతగా రాజకీయ పార్టీ పెట్టి, వ్యవస్థను సరిచేసే పాలనా దక్షులైన వారు అందులోకి రావాలనుకున్నాను. రాత్రికి రాత్రి అనుభవం రాదు, క్రమంగా ఎదుగుతూ ముందుకు వెళ్లాలనుకున్నాను. లక్ష్య సాధన కోసం అంతా కలిసి పని చేయాలన్నదే నా ధోరణి. దానికోసం వ్యక్తిగతంగా కష్టపడతా... సినిమాల్లో దీన్నే ఆచరించా, ఇప్పుడు పార్టీపరంగానూ అంతే. 2014లో పోటీ చేద్దామంటే ఓట్లు చీలిపోతాయని ఆగాను. ముందు రాష్ట్రాన్ని నిలబెట్టుకోవాలి. అందుకే జాతీయస్థాయిలో సరైన ప్రత్యామ్నాయమని మోదీని ఎంచుకుని భాజపా వైపు వెళ్లాను. 2019లోనూ అదే పొత్తు ఉంటుందనుకున్నాగానీ పరిస్థితులు మారాయి. 
జనం విలాసాలేం కోరటం లేదు! 
ఎక్కడికి వెళ్లినా జనం తమకు వరాలు కావాలనేం కోరటం లేదు. గతంలో ఆదిలాబాద్‌ జిల్లాకు వెళితే ఓ తండాలో పెద్దావిడ మంచినీళ్లు ఇప్పించమని కోరింది. పదేళ్ల తర్వాత ఈ మధ్య.. అరకు వెళ్తే అక్కడా తాగు నీళ్లే అడుగుతున్నారు. ఈ దేశానికి కొత్తగా ఏమీ ఇవ్వక్కర్లేదు.. ఉన్న వ్యవస్థను సరిచేయగలిగితే చాలు. తాగునీరు, రహదారుల వంటి మౌలిక వసతులే కోరుతున్నారు. 
తెదేపాతో మళ్లీ పొత్తు ఎలా..? 
తెదేపాతో పొత్తు పెట్టుకుందామని మా పార్టీలోనూ కొందరు సూచించారు. కానీ తెలుగుదేశం నాయకుల్ని ఇసుక మాఫియా అని విమర్శించాక... చంద్రబాబుతో ఎలా పొత్తు పెట్టుకోవాలి? వైకాపా అంటే కాంగ్రెస్‌కు మరో రూపం. కాంగ్రెస్‌ మన రాష్ట్రాన్ని విభజించింది. వైఎస్‌ పాలనలో కొన్ని పనులు చేసినా ఎక్కువ భాగం అవినీతే చూశాం. అది ప్రతిపక్ష నాయకుడిని వెన్నాడుతోంది. అనుభవజ్ఞుడి వల్ల రాష్ట్రానికి మేలు చేకూరుతుందని చంద్రబాబుకు మద్దతిస్తే ఆయన అనుభవం తెదేపా నాయకుల దోపిడీకి, ఇసుక మాఫియాకు ఉపయోగపడింది. వాస్తవంగా నిజం పక్షాన నిలబడాలనేది నా ధ్యేయం. నాకు దేవుడు ఎంత బలమిస్తే అంతే తీసుకుంటాను తప్ప... అవకాశవాద రాజకీయాలు చేయను. ఇద్దరికీ సమాన దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే ఇప్పుడు తెదేపా, వైకాపా, భాజపా వాళ్లంతా నాపై దాడి చేస్తున్నారు. 
ఎవర్నీ పార్టీలోకి ఆహ్వానించను 
జేడీ లక్ష్మీనారాయణతో పరిచయం అబ్దుల్‌కలాం ద్వారా ఏర్పడింది. పార్టీ పెట్టినప్పుడు వస్తారా.. అని అడిగాను. తర్వాత పత్రికాముఖంగానూ ఆహ్వానించాను. ఆయన రాష్ట్రంలో పరిస్థితుల అధ్యయనానికి వెళ్లారు. అసలు నేను ఎవర్నీ పార్టీలోకి రమ్మని ఆహ్వానించను. ఎవరికి వారు ఇష్టపడి రావాలి. నేను స్వచ్ఛందంగా పని చేసుకుంటూ వెళ్లిపోతా. పదవి కోరుకోను. డబ్బు కోరుకోను. ఇలాంటి సందర్భంలో ఆయనే ఇష్టపడి వచ్చారు. నేను కొత్త రాజకీయ తరాన్ని తయారు చేస్తున్నా. నాతోపాటు 10, 15 ఏళ్లపాటు తక్కువ కాకుండా ప్రయాణించే వారికే ప్రాధాన్యం ఇస్తున్నా. 
మూడో వంతు వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలి 
ఈవీఎంలపై అనుమానాలున్నాయి. అమెరికాలోనే ఈవీఎంలు ఉపయోగించడం లేదు. ప్రపంచానికి టెక్నాలజీ అందించిన దేశాలు కూడా ఇప్పటికీ బ్యాలెట్లే వాడుతున్నాయి. తప్పు చేసే వాళ్లు ఎలాగైనా చేస్తారు. ఇటీవల మాయావతిని కలిసినప్పుడు.. ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం ప్రాబల్యమున్న ఓ ప్రాంతంలో ఎదురైన అనుభవం చెప్పారు. వాళ్లు ఓటు వెయ్యని పార్టీకి పోలైనట్లు గుర్తించారు. ఇంతమందికి అనుమానం వస్తోందంటే.. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందని అర్థమవుతోంది. అందుకే ప్రతి నియోజకవర్గంలోనూ మూడోవంతు వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్‌ చేస్తున్నాం. 
సంస్కరణల కోసమే ప్రయత్నం 
ఎంతో కొంత నిర్మాణాత్మకంగా సంస్కరణలు తేవాలని పార్టీ పెట్టాను. రెండు డబ్బున్న పార్టీల మధ్య ఏమాత్రమూ ఖర్చులేని రాజకీయాలు చేయొచ్చని నిరూపించాలనేదే నా లక్ష్యం. రాజకీయాల్లో డబ్బు పెట్టుబడి తగ్గితే తప్ప అవినీతి అంతరించదు. లేదంటే పెట్టుబడిదారులైన రాజకీయ నాయకులు వారు సంపాదించుకున్నాక కానీ ప్రజలకు మేలు చేయరు. ఈ లోపు అయిదేళ్లూ పూర్తవుతాయి. ఈ చక్రానికి అడ్డుకట్ట వేయాలనేది నా ఉద్దేశం. ప్రజలు మనస్ఫూర్తిగా సహకరిస్తే ధన రాజకీయాలను అంతం చెయ్యగలం. 2019లో బీఎస్పీ అధినేత్రి మాయవతి సహకారం తీసుకుంటున్నాం. ఈ సారి మార్పునకు, పారదర్శకతకు, అవినీతిపై పోరాటం చేసే పార్టీకి మద్దతివ్వండి. 
పార్టీ నడపడానికి నిధులెందుకు..? 
పార్టీని నడపాలన్నా, ఎన్నికలన్నా వందల, వేల కోట్లు అవసరమనే భావన సృష్టించారు. లోక్‌సభకు పోటీ అంటే రూ.100కోట్లు, శాసనసభ కంటే రూ.50 కోట్లు కావాలనే అభిప్రాయం తెచ్చారు. అందుకే ఇతర పార్టీలు మంత్రులు, ఎమ్మెల్యేల కుమారులకు టికెట్లు ఇస్తే.. నేను ఓ కండక్టరు కొడుక్కి, నెల్లూరు జిల్లాలో పోలీసు కానిస్టేబుల్‌ కొడుక్కి, వెటర్నరీ డాక్టర్‌కు టికెట్లిచ్చా. కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తున్నా. పార్టీ నడపటం అంత కష్టమా..? తిండికి కావాల్సిన మొత్తం, ఊళ్లు తిరగడానికి వాహనాలకు అవసరమయ్యే నిధులు విరాళాల రూపంలోనే వస్తాయి. నా సభలకు జనాన్ని తెచ్చేందుకు ఏమీ ఖర్చు చేయను. నిజంగా నా పార్టీ ఆఫీసుకు చిన్న గది చాలు. ఉత్తరప్రత్యుత్తరాలకు ఒక చిరునామా, ఈ మెయిల్‌ అడ్రస్‌ వంటివి చాలు. పార్టీ అంటే భావజాలాన్ని వినిపించడం, ఎక్కడైనా సమస్యలుంటే వెళ్లి వాటి పరిష్కార మార్గాలు కనుగొనేందుకు ప్రయత్నించటమే కదా..!

Comments

Popular posts from this blog