దొంగ ఓటును గెలవడం సాధ్యమేనా? సెక్షన్ 49(పి)
ఇటీవల సెక్షన్ 49(పి) గురించి చర్చ
జరుగుతోంది. ఈ సెక్షన్ గురించి చాలా మంది గూగుల్‌లో వెతుకుతున్నారు.
దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన 'సర్కార్' సినిమా నేపథ్యం అంతా ఈ సెక్షన్
49(పి) చుట్టూ తిరుగుతోంది. ఆ సినిమాలో హీరో విజయ్ పోయిన తన ఓటును ఈ
నిబంధన ప్రకారమే తిరిగి దక్కించుకుంటారు.'సర్కార్' సినిమా తర్వాత ఈ సెక్షనేంటో తెలుసుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు.
అయితే,
ఈ సినిమాలో చెప్పినట్లు సెక్షన్ 49(పి)తో పోయిన మన ఓటును వాస్తవంగా
దక్కించుకునే అవకాశం ఉందా? ఇంతకీ సెక్షన్ 49(పి) అంటే ఏమిటి? ఈ నిబంధనతో
మన ఓటును ఎలా పొందవచ్చు?
టెండర్డ్ ఓటు అంటే
మన పేరుతో
ఉన్న ఓటును ఎవరైనా వేస్తే ఆ ఓటును రద్దు చేసి మన ఓటును పొందే అవకాశం
ఎన్నికల సంఘం కల్పించింది. భారత ఎన్నికల సంఘం 1961లో తీసుకొచ్చిన సెక్షన్
49(పి) ఇందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ సెక్షన్ కింద మనం పొందే ఓటును
టెండర్డ్ ఓటు అని పిలుస్తారు.
ఎలా వినియోగించుకోవాలి?
'దొంగ
ఓట్ల వల్ల లేక ఇతర కారణాలతో మన ఓటు కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు మన
ఓటును మనం సాధించుకునే హక్కు సెక్షన్ 49(పి) కల్పిస్తోంది' అని ఉస్మానియా
యూనివర్సిటీ లీగల్ సెల్ డైరెక్టర్, ప్రొఫెసర్ డాక్టర్ వేంకటేశ్వర్లు చెప్పారు.
టెండర్డ్ ఓటు ఎలా వినియోగించుకోవచ్చో ఆయన వివరించారు.
'సెక్షన్
49(పి) ద్వారా ఓటు పొందాలనుకునేవారు ప్రిసైడింగ్ అధికారిని కలవాలి. ఓటు
కోల్పోయన వ్యక్తి మనమేనని ప్రిసైడింగ్ అధికారి ముందు నిరూపించుకోవాలి.
ఇందుకోసం ఓటరు గుర్తింపు కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించాలి.
అప్పుడు ప్రిసైడింగ్ అధికారి ఇచ్చే ఫామ్ 17(బి)లో పేరు, సంతకం చేసి ఆయనకు
తిరిగి ఇవ్వాలి.
అప్పుడు వెనకవైపు తన సంతకంతో ఉన్న టెండర్డ్ బ్యాలెట్
పేపర్‌ను ప్రిసైడింగ్ అధికారి మనకు ఇస్తారు. దానిపై మనకు నచ్చిన అభ్యర్థికి
ఓటు వేసి తిరిగి ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలి. ఆయన ప్రత్యేక కవర్‌లో ఆ
టెండర్డ్ ఓటును భద్రపరిచి లెక్కింపు కేంద్రానికి పంపిస్తారు. ఈవీఎంలో
టెండర్డ్ ఓటు వేసేందుకు అనుమతి లేదు'' అని ప్రొఫెసర్ వేంకటేశ్వర్లు
వివరించారు.
‘చాలెంజ్డ్ ఓటూ ముఖ్యమే’
చాలా
మందికి టెండర్డ్ ఓటుతో పాటు చాలెంజ్డ్ ఓటు గురించి పెద్దగా తెలియదని,
వీటిపై ఓటర్లలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ వేంకటేశ్వర్లు
చెప్పారు.
టెండర్డ్ ఓటు ద్వారా మన ఓటును మనం దక్కించుకోవచ్చు, చాలెంజ్డ్ ఓటు ద్వారా దొంగ ఓట్లను నివారించవచ్చు అని ఆయన పేర్కొన్నారు.
''మనం
టెండర్డ్ ఓటుకు దరఖాస్తు చేసుకున్నప్పుడు లేదా ఇతర సందర్భాల్లో సంబంధిత
పోలింగ్ బూత్‌లో మనకు ఓటు లేదనే కారణంతో అక్కడున్న పోలింగ్ ఏజెంట్
అడ్డుకోవచ్చు. అలాంటప్పుడు పోలింగ్ ఏజెంట్ రూ.రెండు ఫీజు చెల్లించి ఫామ్
14 ద్వారా ప్రిసైడింగ్ అధికారికి రాతపూర్వకంగా మనపై ఫిర్యాదు చేస్తారు.
అప్పుడు వీఆర్‌ఏ లేదా గ్రామస్తుల సమక్షంలో మన గుర్తింపుపై ప్రిసైడింగ్
అధికారి విచారణ జరిపిస్తారు. సదరు వ్యక్తి మనమేనని రుజువైతే ఓటు వేయవచ్చు.
కాదని తేలితే ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు మేరకు మనపై క్రిమినల్ కేసు
పెట్టే అవకాశం ఉంది. అలాగే, పోలింగ్ ఏజెంట్ చెల్లించిన రూ.రెండు ఆయనకే
తిరిగి ఇచ్చేస్తారు'' అని ప్రొఫెసర్ వివరించారు.
'అరుదైన సందర్భంలోనే టెండర్డ్ ఓటు లెక్కింపు'
సెక్షన్
49(పి) ద్వారా మనం ఓటు వేసినప్పటికీ ఎన్నికల సంఘం ఆ ఓటును లెక్కించదు.
అరుదైన సందర్భంలో మాత్రమే టెండర్డ్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఓట్ల
లెక్కింపు ప్రక్రియలో మొదట ఈవీఎంల ద్వారా వచ్చిన ఓట్లను మాత్రమే ఎన్నికల
సంఘం లెక్కిస్తుంది. అప్పుడు ఇద్దరు అభ్యర్థులకు స్వల్ప తేడాతో ఓట్లు వస్తే
నిబంధనల మేరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటుంది. అప్పుడు
కూడా ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తేనే టెండర్డ్ ఓట్లను
లెక్కిస్తుంది.
2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కోర్టు ఆదేశం మేరకు టెండర్డ్ ఓట్లను లెక్కించారు.
ఒక్క ఓటుతో ముఖ్యమంత్రి పదవి దూరం
ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా ఎంతో కీలకం. భారత ఎన్నికల చరిత్రలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన అభ్యర్థులు ఇద్దరున్నారు.
2008లో
రాజస్థాన్ ఎన్నికల్లో నాథ్‌ద్వారా అసెంబ్లీ సీటుకు జరిగిన ఎన్నికల్లో
ముఖ్యమంత్రి రేసులో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సీపీ జోషికి 62,215 ఓట్లు
రాగా, బీజేపీ అభ్యర్థి కల్యాణ్ సింగ్ చౌహాన్‌కు 62,216 ఓట్లు వచ్చాయి.
రీకౌంటింగ్ చేసినప్పటికీ అదే ఫలితాలు రావడంతో ఎన్నికల సంఘం కల్యాణ్
సింగ్‌ను విజేతగా ప్రకటించింది.
అయితే, ఈ ఎన్నికల్లో కొందరు టెండర్డ్
ఓటు వేశారని వాటి ఓట్లు లెక్కించాలని, తన ప్రత్యర్థి కల్యాణ్ సింగ్ చౌహాన్
భార్య రెండు చోట్ల ఓటు వేశారని వాటిని రద్దు చేయాలని సీపీ జోషి రాజస్థాన్
హైకోర్ట్‌ను ఆశ్రయించారు. హైకోర్ట్ నుంచి ఈ కేసు సుప్రీం కోర్ట్ వరకు
వెళ్లింది. చివరకు సుప్రీం ఆదేశంతో టెండర్డ్ ఓట్లతో కలిపి ఎన్నికల సంఘం
రీకౌంటింగ్ చేసింది. ఈసారి లెక్కింపులో కల్యాణ్ సింగ్, జోషిలకు సమాన ఓట్లు
వచ్చాయి. దీంతో ఎన్నికల సంఘం డ్రా తీసి కల్యాణ్ సింగ్‌ను విజేతగా
ప్రకటించింది.
కర్నాటకలో..
కర్నాటకలోని
సంతేమరహళ్లి నియోజకవర్గానికి 2004లో జరిగిన ఎన్నికల్లో ఏఆర్ కృష్ణమూర్తి
జేడీఎస్ టికెట్‌పై పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్.ధ్రువనారాయణ
బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో కృష్ణమూర్తికి 40,751 ఓట్లు రాగా,
ధ్రువనారాయణకు 40,752 ఓట్లు వచ్చాయి. దీంతో ఒక్క ఓటుతో కృష్ణమూర్తికి
గెలుపు దూరమైంది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో గట్టెక్కిన కోమటిరెడ్డి
ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్‌లో 2009లో నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్
ఓట్లను లెక్కించే అవసరం వచ్చిందని ప్రొఫెసర్ వేంకటేశ్వర్లు చెప్పారు.
''నల్గగొండ
శాసన సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి
వెంకట్ రెడ్డి పోటీ చేయగా, సీపీఎం అభ్యర్థిగా నంద్యాల నర్సింహారెడ్డి
బరిలోకి దిగారు. లెక్కింపు సమయంలో గెలుపు ఇద్దరి మధ్యా దోబూచులాడింది.
చివరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించారు. ఆ
ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా వచ్చిన కోమటిరెడ్డి విజయం
సాధించారు' అని పేర్కొన్నారు.
Comments
Post a Comment