లాస్ట్ డైలాగ్ మనదే అయితే ఆ కిక్కే వేరబ్బా
అత్తారింటికి దారేది సినిమాలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒక మంచి డైలాగ్ రాశారు. చివర్లో ఉన్న ఫైటింగ్ సీను. హీరో కళ్లజోడు విసిరి… దాన్ని ముట్టుకుంటే నన్ను ముట్టుకున్నట్టే… నన్ను ముట్టుకుంటే నేను చచ్చినట్టే అని. లాస్ట్ డైలాగ్ మనదే అయితే ఆ కిక్కే వేరబ్బా అని అంటాడు. ఈ డైలాగు ముఖ్యమంత్రి చంద్రబాబుకీ, మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న నయా పెట్టుబడిదారులకూ అతికినట్లు సరిపోతుంది.
కేంద్రంలోని భాజాపా ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు చెందిన అపర కోటీశ్వరులను ముట్టుకుంది. వారిని ముట్టుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ముట్టుకున్నట్టే మరి. దేశంలో మనీ లాండరింగ్ వంటి ఆర్థిక నేరాలకు పాల్పడిన బడా బడా పారిశ్రామికవేత్తలపై భాజపా ప్రభుత్వం విచారణకు సిద్ధమైనపుడు వారు చీకటిలోకి అదృశ్యమయ్యారు తప్ప… మోడీని దించేస్తామని చెప్పే ధైర్యం చేయలేకపోయారు. మీదు మిక్కిలి అరెస్టులకు భయపడి విదేశాలకు పారిపోయారు.
మన తెలుగు రాష్ట్రాలకు చెందిన నయా పెట్టుబడిదారులు విదేశాలకు పారిపోలేదు. సరికదా… స్వేచ్ఛగా ఇక్కడే తిరుగుతున్నారు. చక్కగా విలేకరుల సమావేశాలు పెట్టి అందమైన అబద్ధాలను శాటిలైటు ఛానెళ్ల ద్వారా ప్రచారంలోకి తెస్తున్నారు. అదీ ఆంధ్రవాళ్ల (ఆంధ్ర అంటే తెలుగుదేశం డిక్షనరీ ప్రకారం సొంత సామాజిక వర్గమనే) దమ్మూ… ధైర్యం. బడా పారిశ్రామికవేత్తలకు దన్నుగా ఏ ముఖ్యమంత్రీ ఇంత బాహాటంగా నిలబడిన సందర్భం కూడా లేదు. కానీ ఇక్కడ పరిస్థితి విచిత్రం. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనీ, దేశం మొత్తాన్నీ ఏకం చేసి మోడీ సంగతి తేల్చేస్తామని సాక్షాత్తూ ఆంధ్ర సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మరీ దేశం నడిబొడ్డున నిలబడి మరీ సవాలు విసిరి వచ్చారు. అదీ చంద్రబాబు అంటే….
చంద్రబాబులోని ఈ తెగువను చూసే, విదేశీ పెట్టుబడిదారులు వారి వారి అవసరాల కోసం ఆయన్ను సీఈవో అని కీర్తించింది. సొంత సామాజిక వర్గ సమస్యను తెలుగు వారి సమస్యగా చేసి… ప్రధానమంత్రికే సవాలు చేశారు. ఢిల్లీ పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన ఒక మాట అన్నారు. ఆర్థిక వనరులపై దెబ్బకొడతారా అంటూ ఆక్రోశించారు. ఎవరిదీ ఆక్రోశం? మనలో మన మాట… ఆంధ్రా (అర్థం తెలుసుగా..) పెట్టుబడిదారుల ఆక్రోశమేగా…? వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిగా చేసినప్పుడే… చంద్రబాబు సామాజిక వర్గం కంగుతిన్నది. సంతోషించాల్సింది పోయి బాధపడుతున్నారెందుకో అర్థం కాలేదు (ఆలస్యంగా అర్థమైందనుకోండి).
5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలు అన్నారు గానీ… అందులో సొంతవారి ఆకాంక్షలేగా ఉన్నది… ఏది ప్రజాస్వామ్యం బాబూ..? చిరంజీవి పార్టీ పెట్టినపుడు ‘‘అందరివాడూ అనుకున్నాం కానీ ఆయన కొందరివాడే’’నని చెబుతూ పార్టీని మన సామాజికవర్గానికి చెందిన వారే దుంప నాశనం చేశారు కదా. ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగపరంగానే అందరివాడూ కావాలి. కానీ.. మీరు ప్రజాస్వామ్యం పేరు చెప్పి… లోలోన కొందరివాడుగానే వ్యవహరిస్తున్నారు కదా. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటానికి అర్హత ఏముంది? ప్రధాన స్రవంతిలోని దినపత్రికలు ఇవేమీ రాయవన్న సంగతి తెలిసిందే. మీరు ఒకసారి సోషల్ మీడియలో వచ్చే కామెంట్లు చూస్తే, మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నదీ తెలుస్తుంది.
బ్రిటన్ పార్లమెంటులో హౌస్ ఆఫ్ లార్డ్స్ (మన రాజ్యసభ వంటిది) సభకు 5 నిమిషాలు ఆలస్యంగా రావడం వల్ల ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పే అవకాశం పోయిందని, బేట్ అనే సభ్యుడు రాజీనామా చేశారు. ఆయన ఎక్కడ? పెట్టుబడిదారుల కోసం ప్రజాస్వామ్యం ముసుగు ధరించి… స్వార్థంతో మీడియా ముందు బాహాటంగా అబద్ధాలు వల్లెవేస్తున్న మీరు ఎక్కడ? ఏది ప్రజాస్వామ్యం? ఎప్పటికయినా ‘ట్రూత్ ఈజ్ ట్రూత్’ అని ఒక మాట అన్నారు మీరు. ఇది నిజం. ప్రజలు దీనిని గమనించకపోలేదు. ఎన్నికలు వచ్చినపుడు చెబుతారు.
మీ పెట్టుబడిదారులపై ఐటీ అధికారులు దాడులు చేస్తే, ఏకంగా ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడినట్లు గగ్గోలు పెడుతున్నారు. రేపు ఏదో ఒక పచ్చ పత్రికపై దాడి చేస్తే, పత్రికా స్వేచ్చే ప్రమాదంలో పడిందని అంటారు కదా. ఇది అక్షర సత్యం కాదా? ప్రజాస్వామ్యం ఎక్కడ ప్రమాదంలో పడింది చెప్పండి మీ అక్కసు తప్ప. కేంద్రం నుంచి డబ్బులు రాకపోవడంతో మీ మీద ఆధారపడ్డ వారికి కాంట్రాక్టులు ఎలా ఇవ్వాలనేది మీ బాధ.. ప్రజల కోసం ఉద్దేశించిన అభివృద్ధి పనులన్నీ కూడా మీ పార్టీలకు, నేతలకూ, వారి వెనుక దాక్కున పెట్టుబడిదారీ వర్గాలకు బంగారు బాతులు కదా. ఇదే కదా జరుగుతున్నది. మీరు ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టిందే దొడ్డిదారిలో. మరి నేనే ఈ దేశంలో సీనియర్ నాయకుడిని అని చెప్పటంలో నైతికత ఎంత?
ఎన్టీరామారావును వెన్నుపోటు పొడిచారు… ఇది అన్యాయం కాదా..? ముసలాయిన లక్ష్మీపార్వతి ప్రేమలో పడి పార్టీని ఏం చేస్తాడోనని నందమూరి కుటుంబం కంటే ఎక్కువ… మీ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు భయపడ్డారు. వారు ఆడిన వింత నాటకం కాదూ ఇది? తెలుగుదేశం పార్టీని కుటుంబానికి చెందిన ఆస్తిగా మార్చేశారు. దరిమిలా ఉమ్మడి రాష్ట్రాన్నీ సొంత ఆస్తిగా చేసుకున్నారు. సమాజం అవసరాలకంటే సొంత అవసరాలే… మీరు దన్నుగా ఉన్న సామాజిక వర్గానికి ముఖ్యమయ్యాయి. దీనినే నియంతృత్వం అని అంటారు. ఒక వ్యవస్థను నియంతృత్వ స్థాయికి తీసుకుపోయిన తర్వాత కుప్పకూలడం ఖాయం. చరిత్రలో అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
ఒకప్పుడు మీరు మారారు అని అన్నారు. మీరు మారడం అసాధ్యం. ఎందుకంటే మీ కంటే, మీ కుటుంబం కంటే కూడా సామాజిక వర్గానికి చెందిన ఆకాంక్షలు, వారి అత్యాశలూ తెలుగుదేశం పార్టీతో ముడిపడిపోయాయి. వారి అవసరాలు… ఆకాంక్షలూ మిమ్మల్ని నడిపిస్తాయి. పార్టీనీ నడిపిస్తాయి. వారికి కావాల్సినట్లు మాట్లాడిస్తాయి. ఆడిస్తాయి. ఇది తెలుగుదేశం పార్టీకే నష్టం. నందమూరి కుటుంబం నుంచి… పార్టీ నారా వారి కుటుంబానికి బదిలీ అయిపోయినపుడే.. ఎన్టీరామారావు ఆశయాలకు ఎప్పుడో సమాధి కట్టేశారు.
పత్రికలు కూడా తెలుగుదేశాన్ని విమర్శించకుండా ఎత్తుబిడ్డలా మితి మీరిన ముద్దు చేశాయి. విమర్శను సహించలేని స్థాయికి తెచ్చాయి. అందువల్ల తెలుగుదేశం ఇపుడు సామాన్యుల ఆకాంక్షలను ప్రతిబింబించడం లేదు. ఇప్పటికీ కళ్లు తెరవకపోతే… కొత్త నీరు రాక తప్పదు. వస్తుంది. కాలం బలవంతంగానైనా మార్పులను తెస్తుంది. ప్రజలు అందుకు సిద్ధంగానే ఉండి ఉంటారు.
ఆపరేషన్ గరుడ వంటివి ఫక్తు నాటకాలుగా కన్పించడం లేదూ…. శివాజీ అని ఎవరో ఒకరు చెబితే నమ్మలేదని, తర్వాత షాక్ అయ్యాను అని అన్నారు. మీకు తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా? ప్రజల్లో అసంతృప్తి రాకుండా… వారికి అన్ని విషయాలూ చెప్పకూడదు అని కౌటిల్యుడు చెప్పిన కాలం వేరు.. ఈనాటి పరిస్థితులు వేరు. ఇపుడు నిజాయితీ గల నేతల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చెప్పగల ధీరోధాత్తుల కోసం వెదుకుతున్నారు. తప్పు చేయడం మానవ సహజం. మీరెప్పుడైనా ‘‘అవును. ఈ తప్పు చేశాను… ’’ అని మీరు కనీసం మీరు నమ్మిన, మీవాడే అనుకుంటున్న తిరుమల స్వామి వారి దగ్గరైనా పశ్చాత్తాపపడ్డారా? పెట్టుబడిదారులే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నంత కాలం రాజకీయ పార్టీలు ప్రజల ఆకాంక్షలను ఎంతమాత్రం ప్రతిబించలేవు. నారా వారి తెలుగుదేశం పార్టీ దీనికి అద్దం పడుతున్నది. కాదంటారా?
Comments
Post a Comment