ఆంధ్రలో భూ మంత్ర కాళీ!
సుబ్బారావుది చిన్న కుటుంబం. ఆ కుటుంబం దగ్గర ఒక లక్ష రూపాయలే ఉన్నాయి.
కానీ…భార్య వైద్యం కోసం ఆ డబ్బులు దాచి పెట్టాడు. కొడుకు వచ్చి ‘నాన్నా
నాకు బండి కొనివ్వు’ అని తండ్రిని అడిగితే… తండ్రి కొనిస్తాడా? ఇంత కంటే
ముఖ్యమైన అవసరం ఉంది… తర్వాత కొనుక్కుందాలే అని సర్దిచెబుతాడు. అదే
ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఏం చేస్తాడో తెలుసా? కొడుక్కు బండి కొని
ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఏది ముఖ్యం… ఏది ముందు చేయాలన్నది ఆయన డిక్షనరీలోనే
లేదు.
ఒక పక్క రాజధాని లేక, రాజధాని కట్టేందుకు డబ్బులు లేక ప్రజలు సతమతం
అవుతుంటే… ముందు ఆయనకు పార్టీ ఆఫీసులు కావాల్సి వచ్చిది. రాజు తలచుకుంటే
దెబ్బలకు కొదవా అన్నట్లు వెంటనే ఫైళ్లు కదిలాయి. ప్రకాశం, కృష్ణా, విజయనగరం
జిల్లాల్లో ఒకటి చొప్పున, గుంటూరు జిల్లాలో రెండు చొప్పున తెలుగుదేశం
పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం … ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ
స్థలాలను దారాధత్తం చేయాలని నిర్ణయించేశారు. ఆ మేరకు జీవోలు కూడా విడుదల
చేశారు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవడం తప్పుకాదు కానీ… అందుకోసం కోట్లాది
రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాలను అప్పనంగా నొక్కేసి మరీ పార్టీ
కార్యాలయాలు కట్టుకోవాల్సిన పని ఏమిటన్నది ప్రశ్న.
ఉదాహరణకు ఒంగోలు
పట్టణంలో 1.96 ఎకరాల స్థలాన్ని (సర్వే నెం.68/8) పార్టీ ఆఫీసుకు అద్దె
ప్రాతిపదికన 33 సంవత్సరాలపాటు ఇచ్చివేయాలని రాష్ట్ర ప్రభుత్వం
నిర్ణయించింది. అదీ ఎంతకో తెలుసా? ఏడాదికి ఎకరాకు రూ.1000లకే… ఇంత కారు
చౌకగా ప్రభుత్వ భూములు ఎక్కడా లభించవు. మరి ఈ స్థలం మార్కెట్ రేటు ఎంతో
తెలుసా? రూ.5,69,18,400. అంటే రూ.5 కోట్ల విలువైన స్థలాన్ని తెలుగుదేశం
పార్టీ కార్యాలయానికి ఇచ్చేస్తున్నారన్నమాట.
ఒక వైపు తెలుగు ప్రజలకు
రాజధాని లేదు. దాని నిర్మాణం ఎలా జరుగుతుందోనన్న ఆందోళన అందరిలోనూ ఉన్నది. ఈ
నేపథ్యంలో ఖరీదైన ప్రభుత్వ స్థలాలను ఉచితంగా పార్టీ ఆఫీసులకు ఇవ్వడం ఎంత
వరకూ సబబన్నది చంద్రబాబు ఆలోచించుకోవాలి. తెలుగు ప్రజలు ఆలోచించుకోవాలి.
విచిత్రం ఏమంటే… ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ఒక
ఆఫీసు ఉన్నది. దామచర్ల జనార్ధనరావు పార్టీ కోసం ఇచ్చిన స్థలంలో పార్టీ
ఆఫీసు నడుస్తున్నది. పార్టీ ఆఫీసు ఉన్న తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి
ప్రభుత్వం ఎందుకు సొంత స్థలాన్ని సమకూర్చాలని ప్రయత్నిస్తున్నది? పార్టీ
పేరుతో అన్ని జిల్లాల్లో విలువైన స్థలాలను ఆక్రమించుకోవాలని ప్రయత్నమా?
జిల్లా కలెక్టరు సిఫార్సు చేయడం, ప్రజల నుంచి అభ్యంతరాలేమీ లేకపోవడం వల్ల
ప్రభుత్వం జీవో విడుదల చేసేసింది. పార్టీ కార్యకలాపాలకు తప్ప… ఇతర
ప్రయోజనాలకు దీనిని ఉపయోగించరాదన్న నిబంధన అయితే ఉంది కానీ… దీనిని కూడా
ఏలుబడిలో ఉన్నవారు ఎంత వరకూ పాటిస్తారన్నది అనుమానమే.
హ్యాయ్ ల్యాండ్ విషయంలో తెలుగుదేశం నేతలు, పార్టీ ముఖ్యనేత కుమారుడికి
చెందిన బినామీ ఒకరు హ్యాయ్ ల్యాండ్ ను చౌకగా కొట్టేసేందుకు
ప్రయత్నిస్తున్నారంటూ అనేక వార్తలు వచ్చాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టవద్దంటూ ప్రజల్లో అసంతృప్తిని రగిలించిన
వారికి ఇపుడు ఓ గొప్ప అవకాశం వారిని వెదుక్కుంటూ వచ్చింది. ఆంధ్రలో
అభివృద్ధే లేదు.. అభివృద్ధి పేరుతో ఇపుడు దోచుకునే వారికి దోచుకున్నంత.
కోట్లాది రూపాయల కాంట్రాక్టులు అయిన వారికి కట్టబెట్టవచ్చు. వివాదంలో ఉన్న
వాటినీ, లేని వాటినీ… అందినకాడికి నొక్కేసే కార్యక్రమానికి అధికార పార్టీ
మంత్రులు, నేతలూ తెర తీశారు.
ఇదంతా చూసి… మరో సామాజిక వర్గం ఓర్చుకోలేని
పరిస్థితిలో ఉన్నది. వారి ప్రభుత్వం వస్తే… ఇంతకు పది రెట్లు
నొక్కేయాలన్నది వారి ఆలోచన. ఇపుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే…. అది
ఊరిస్తున్న ఓ బంగారు బాతు. ప్రజా సేవ ముసుగులో ఇపుడు అర్జంటుగా ఆ బాతును
కోసుకుని తినేయాలి. పార్టీ పేరుతో స్థలాలు ఇపుడెందుకు? అంత అర్జంటు ఎందుకు?
ఒక వేళ తమ ప్రభుత్వం రాకపోతే… ఏమవుతుందోనన్న ఆందోళనతో రాత్రికి రాత్రే
పనుల్ని చక్కబెట్టేయడం అన్నమాట.
హైదరాబాద్ లో ఉన్నపుడు కూడా రాజశేఖర రెడ్డి
ప్రభుత్వంగానీ, చంద్రబాబు ప్రభుత్వంగానీ చేసింది ఇదే. అంతర్జాతీయ
విమానాశ్రయం కట్టక ముందే… ఆ విషయాన్ని తెలుగుదేశం తైనాతీలకు …ముందే
ఉప్పందించారు. అంతా గుట్టు చప్పుడు కాకుండా, లక్షో రెండు లక్షలో పడేసి,
అనేక భూములు కొన్నారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ
తెలుగుదేశం పెద్దలు వందల ఎకరాలు కొనేశారు. ఒక్కొక్కరు 500 ఎకరాలకు తక్కువ
కొనలేదు. విమానాశ్రయం వస్తున్న విషయాన్ని దాచిపెట్టి, లక్షల్లో కొన్న
భూముల్ని కోట్లలో అమ్ముకున్నారు. దీనికేం చెబుతారు?
హైదరాబాద్ ను అభివృద్ధి
చేసింది మేమే అని ఈనాటికీ చెబుతున్నది తెలుగు దేశం పార్టీ. ప్రజలు
తెలుసుకోవాల్సింది ఏమంటే.. అభివృద్ధి ముసుగులో పార్టీలు, నేతలు ఎంత
నొక్కేస్తున్నారనే. ఎయిడ్స్ అంటే ఏమిటి అని అడిగితే ఎవరైనా ఏం చెబుతారు.
అదొక భయంకరమైన వ్యాధి అని సమాధానం చెబుతాం. అదే కొన్ని స్వచ్ఛంద సంస్థలను
అడగండి. ఎయిడ్స్ అంటే డబ్బు అని చెబుతారు. అందులో అంత డబ్బు సంపాదించే
అవకాశం ఉంటుందన్నమాట.
అలాగే… మన నేతలు, పార్టీలకు అభివృద్ధి అంటే ఏమిటి అని
అంటే.. డబ్బు అనే అర్థం. ప్రజా సేవ ముసుగులో కాంట్రాక్టులు.. డబ్బులూ.
గోనె సంచుల్లో దాచుకునేంత డబ్బు. నోట్ల రద్దు ప్రభావం కూడా ఈ నల్ల
కుబేరులపై పడలేదంటే చూడండి. డబ్బుకున్న పవర్ అది. డబ్బున్న వారికి ఉన్న
పవర్ అది. మరి సామాన్యులకు సేవ చేసేవారు ఎక్కడ?
ఒక వ్యక్తి తన జీవితంలో పొలం దున్ని సంపాదిస్తేనో, వ్యాపారం చేస్తేనో
కోట్లు వస్తాయా? ఇదిగో ఇలా అక్రమాలు చేస్తే… వందల కోట్లేమిటి? వేల కోట్లు
సంపాదించవచ్చు. అధికారంలో ఉన్నవాళ్లు మన వాళ్లు అయితే చాలు. ఇదీ ప్రస్తుతం
నడుస్తున్న చరిత్ర.
2019లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా, వైసీపీ ప్రభుత్వం
వచ్చినా… ప్రజా సేవ ముసుగులో ఆంధ్ర ప్రదేశ్ అనే బంగారు బాతును కోసేసుకుని
తినేయడం ఖాయం. 2019లో జనసేన అధికారంలోకి రాకపోతే మాత్రం… జరిగేది ఇదే.ఇది వ్రాసి పెట్టుకోండి.ఇదే జరుగుతుంది...జరిగితీరుతుంది.
Comments
Post a Comment