విశాఖ భూ కుంభకోణంలో లోగుట్టు ఏమిటి..?

- విశాఖ భూ కుంభకోణంలో అధికారుల మెడకు ఉచ్చు…!
- రాజకీయ నాయకులు దొరికినా… దొరక్కపోయినా దొరలే
- దొర పెత్తనం మనదే అయినపుడు భయం ఎందుకు?
- తప్పు జరిగిందని చెప్పారంటేనే.. భూములు కొట్టేసినట్లే
- మరి భూముల స్వాధీనం గురించి చెప్పరేమి?
‘‘దొరికితే దొంగలు… లేకపోతే దొరలు’’ అన్నది
పాత సామెత అయిపోయిందని మీకు తెలుసా? దొరికినా దొరలే… దొరక్కపోయినా దొరలే…
అన్నది ఈ నాటి రాజకీయ నాయకులకు అతికినట్లు సరిపోతుంది. ఎందుకంటే ఇపుడు
రాజకీయ నాయకులు దొరికిపోయినా, దొరక్కపోయినా తప్పించుకుపోవడం మామూలు
అయిపోయింది.
చిన్న లేడి పిల్లను చంపినందుకు సల్మాన్ ఖాన్ జీవితాంతం కోర్టుల
చుట్టూ తిరుగుతున్నాడు కానీ… అదే సల్మాన్ ఖాన్ మన తెలుగు రాష్ట్రంలో… ఏ
బడా సామాజిక వర్గంలో పుట్టి ఉంటే… కోర్టులే ఆయన జోలికి రావడానికి భయపడేవి.
పోలీసులు వంగి వంగి దండాలు పెట్టేవారు. అది మహారాష్ట్ర కాబట్టి సల్మాన్
ఖాన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు.
విశాఖ భూ కుంభకోణం గురించి చెప్పాలని మొదలు
పెట్టి… ఏమేమో చెప్పుకుంటున్నాం. సరే. ఇపుడు విశాఖ కుంభకోణంలో రాజకీయ నేతలు
ఎవరూ లేరట. చేసిందంతా అధికారులేనట.‘‘తెలుగుదేశం ప్రభుత్వంలో
అధికారులను బలిపశువులను చేయడం రివాజు, లేదా ఆనవాయితీగా వస్తోంది.
అధికారుల మెడకు ఉచ్చు..?
తాజాగా సిట్ నివేదికలోని అంశాల ప్రకారం…
ఇపుడు ఉచ్చు అధికారుల చుట్టారా బిగిస్తోందని తెలుస్తోంది. ఈ కుంభకోణంలో
అధికారుల పాత్ర ఉందని సిట్ పేర్కొన్నట్లు సమాచారం. ముగ్గురు కలెక్టర్లు,
నలుగురు జాయింటు కలెక్టర్లను సిట్ అభిశంసించినట్లు తెలుస్తోంది. గతంలో
విశాఖ జిల్లాలో కలెక్టర్లుగా పనిచేసిన ముగ్గురు కలెక్టర్లు, నలుగురు
జాయింట్ కలెక్టర్లు తప్పిదాలను సిట్ ఎత్తి చూపింది. ప్రస్తుతం విశాఖ
కలెక్టర్ గా ఉన్న ప్రవీణ్ కుమార్ గతంలో ఇదే జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా
పని చేసిన కాలంలో అవకతవకలకు పాల్పడినట్లు నిర్థారించడం ఇప్పుడు
చర్చనీయాంశంగా మారింది.
ఐపీఎస్ అధికారి అయిన వినీత్ బ్రిజ్ లాల్ సారధ్యంలో
పోలీసు, రెవిన్యూ అధికార వర్గాలు కలసి 2017 జూన్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం
ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఈ టీమ్ లో ప్రస్తుతం జాయింట్
కలెక్టర్ గా ఉన్న గుమ్మళ్ల సృజన కూడా ఉన్నారు. ఈ సిట్ చేసిన దర్యాప్తులో
పలు కీలక అంశాలు వెలుగులోకి రావడంతో పాటుగా కఠిన చర్యలకు సిఫారసు చేయడం
సంచలనం రేకెత్తిస్తోంది.
విశాఖ భూ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు
బృందం ఇచ్చిన నివేదికలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటుగా ఆయన
అనుచరులు మరో నలుగురుపైనా కఠిన చర్యలకు సిఫారసు చేసింది. ఈ కుంభకోణంలో కీలక
పాత్రపోషించారంటూ అధికారులపై చర్యలకు సిఫారసు చేసింది. గతంలో విశాఖ
కలెక్టర్‌లుగా పని చేసిన లవ్ అగర్వాల్, జె.శ్యామలరావు, సునీల్ శర్మలపై
కూడా చర్యలకు సిట్ సిఫారసు చేసింది. లవ్ అగర్వాల్ కేంద్ర సర్వీసులలో
ఉండగా, శ్యామలరావు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా ఉన్నారు. సునీల్ శర్మ
తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నారు.
ఇక.. విశాఖ జేసీలుగా పని చేసిన ఎంటీ
కృష్ణబాబు , వీరబ్రహ్మయ్య , సందీపకుమార్ సుల్తానియాలపై చర్యలు
తీసుకోవాలని సిఫారసు చేశారు. కృష్ణబాబు ప్రస్తుతం విశాఖ పోర్టు ట్రస్ట్
చైర్మన్ గా ఉండగా, వీరబ్రహ్మయ్య, సందీప్ కుమార్ సుల్తానియా తెలంగాణ
సర్వీసులో పని చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్లుతో ఈ చిట్టా ఆగలేదు.
విశాఖలో డీఆర్‌వోగా పని చేసి ఐఏఎస్ పదోన్నతి పొంది ప్రస్తుతం కర్నూలు
కలెక్టర్ గా పనిచేస్తున్న ఎస్ సత్యనారాయణపై కూడా కొన్ని కేసుల్లో కఠిన
చర్యలకు సిఫారసు చేశారు. విశాఖ జిల్లాలో రేగిన రాజకీయ చిచ్చు… దాని పలితంగా
సిట్ ఏర్పాటైంది. మంత్రి గంటా శ్రీనివాసరావు, అతని కుటుంబికులు, అనుచరులు
విశాఖకు వలస వచ్చి భారీగా ప్రభుత్వ భూములను దోచుకుంటున్నారని ఆయన సహచర
మంత్రి అయ్యన్నపాత్రుడు బహిరంగంగానే ఆయనపై యుద్ధానికి దిగిన విషయం
తెలిసిందే.
సరిగ్గా ఇదే సమయంలో మూడు వేల కోట్ల రూపాయల
విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని సాక్షాత్తు జిల్లా కలెక్టర్
ప్రవీణ్ కుమార్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గత ఏడాది జూన్ మాసంలో సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తునకు
ఆదేశించారు. దాదాపు ఆరు నెలల పాటు దర్యాప్తు చేసిన సిట్ ఈ ఏడాది జనవరిలో
ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే ఈ నివేదికను ఇచ్చి తొమ్మిది నెలల
తర్వాత ప్రభుత్వం ఆమోదించడడం విశేషం.
చాలా కాలం ప్రభుత్వం సిట్ నివేదికను
బహిర్గతం చేయడడం లేదని, ప్రభుత్వ పెద్దలు ఉన్నందునే దీనిని తొక్కి
పెట్టారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దీనిపైనా పెద్ద దుమారమే చెలరేగింది.
ఎందుకంటే అధికార పార్టీకి చెందిన నేతలే నిందితులని సిట్ నివేదిక
తేల్చిందని, అందుకే బహిర్గతం చేయడం లేదని వైసీపీ అధినేత జగన్, బీజేపీ
శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీపై
దుమ్మెత్తి పోశారు. అయితే ఇప్పుడు సిట్ నివేదికలో అధికార పార్టీ నేతలకు
క్లీన్ చిట్ ఇచ్చారని, గతంలో మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు ను
మాత్రమే రాజకీయంగా బాధ్యుడు చేయడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి.
ఒక సందేహం…
ఇంతకీ అధికారులు తప్పు చేశారని తేలిస్తే దాని
అర్థం ఏమిటి?… భూములు అన్యాక్రాంతం అయినట్లేనని ప్రభుత్వం ఒప్పుకున్నట్లే
కదా. అంటే విశాఖలో 3 వేల ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఎవరో కొట్టేసిన మాట
వాస్తవమనేగా… అంది గంటా శ్రీనివాసరావు కావచ్చు… లేదా బయటకు కనిపించని
పారిశ్రామికవేత్తలు కావచ్చు… లేదా పెద్దోళ్ల బినామీలు కావచ్చు… అధికారులు
ఎవరికి ఇచ్చినా…. ఆ మూడు వేల ఎకరాలనూ గుర్తించి వెనక్కి తీసుకోవడం
తక్షణావసరం. భూములేమీ చాక్లెట్లు కావుగా… కనిపించడం లేదని చెప్పి
తప్పించుకోవడానికి… అందుకని తక్షణం భూములను స్వాధీనం చేసుకుంటే… అధికారులే
తప్పు చేసినా అందుకు ప్రోత్సహించిన వారిపైనా చర్య తీసుకోవాల్సిన అవసరం
ఉంది.
Comments
Post a Comment