175 సీట్లకూ వామపక్షాలతో కలసి పోటీ చేస్తున్నాం: పవన్ కళ్యాణ్

- అధికార, ప్రతిపక్షాలు చెప్పేది నమ్మవద్దు
- అయోమయాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు
- అభ్యర్థులుగా యువతకూ, మహిళలకూ ప్రాధాన్యం
- వామపక్షాలతో మాత్రమే కలిసి వెళతాం
- స్పష్టం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
అమరావతి: ఏపీలో ఉన్న 175
స్థానాల్లో పోటీ చేస్తామని, వామపక్షాలతో తప్ప ఎవరితోనూ పొత్తు పెట్టుకునే
ఉద్దేశం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన
పార్టీపై అధికార పక్షం తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,
అలాగే ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి దుష్ప్రచారం చేస్తున్న సంగతి
తెలిసిందే.
జన సైనికుల్లో, ప్రజల్లో అపోహల్ని కల్పించేందుకు అధికార,
విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, ఎవరూ వారు చెప్పే మాటల్ని నమ్మవద్దని పవన్
కళ్యణ్ సూచించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన, వీడియో సందేశాన్ని విడుదల
చేశారు. ‘‘జనసేన పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తున్నాం.
వామపక్షాలు తప్ప ఎవరితో కలిసి వెళ్ళం. యువతకు , మహిళలకు ఎక్కువ అవకాశం
ఇస్తాం. దయచేసి అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు. ముక్తకంఠంతో
ఖండించండి’’ అంటూ పవన్ అందులో పేర్కొన్నారు.
ప్రతిపక్ష వైఎస్సార్సీపీ తమకు
అన్ని స్థానాలు ఇచ్చిందీ… ఇన్ని స్థానాలు ఇచ్చిందీ అంటూ బయట జరుగుతున్న
ప్రచారం కూడా తన దృష్టికి వచ్చిందని పవన్ తెలిపారు. జన శ్రేణులను
అయోమయానికి గురి చేసి, కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీయాలన్నదే వారి
ఉద్దేశమని చెప్పారు. 2014లో ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యానే తెలుగుదేశం
పార్టీకి మద్దతు ఇచ్చామని, ఇపుడు సమతుల్యత కోసం 175 సీట్లలో పోటీ
చేస్తామని, యువతకూ, మహిళకూ సీట్ల విషయంలో పెద్దపీట వేస్తామని అన్నారు.
కొత్తతరాన్ని రాజకీయాల్లో ప్రవేశపెట్టేందుకు ఒక వ్యూహ రచన చేస్తున్నట్లు
వెల్లడించారు. భావి తరాల భవిష్యత్తు కోసం కట్టుబడి ఉన్నామని, జనసేనపై
జరుగుతున్న దుష్ప్రచారాన్ని గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో కార్యకర్తలు,
పార్టీ అభిమానులూ ఖండించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
Comments
Post a Comment