2019 ఎన్నికల మైండ్ గేమ్: అసలు నిజం ఇది కదా…!!

 
అమరావతి: పోస్టు ట్రూత్ వరల్డ్ (నిజాలకు పాతర వేసిన కాలం)లో రాజకీయాలను అర్థం చేసుకోవడానికి సునిశితమైన దృష్టి కావాలి. ‘‘కుట్ర జరుగుతోంది… కుట్ర జరుగుతోంది’’ అంటూ వార్తలు వస్తున్నాయంటేనే నిజం చచ్చిపోయిందని చెప్పడానికి బలమైన ఉదాహరణ! ఇలాంటి వార్తల సంఖ్య పెరగడం లేదూ..!! అందుకే ఒక రాజకీయ నాయకుడు ఒక స్టేట్ మెంట్ ఇచ్చాడంటే అదే నిజమన్న భ్రమలో పడిపోరాదు. దాని వెనుక అతని ఉద్దేశం ఏమై ఉంటుందో ఆలోచించాలి.

             నిన్న అమరావతిలో సీఎం చంద్రబాబు మట్లాడుతూ… పవన్ కళ్యాణ్ మాతో కలిసి పోటీ చేస్తే జగన్ కు ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నించడం ద్వారా ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలన్నది ఆయన ఉద్దేశం. జనసేన ఇప్పటికీ తెలుగుదేశం పార్టీతోనే ఉందన్న భావన కల్పించి ప్రజలను తికమక పరిస్తే… జనసేన తనకు బాసటగా నిలుస్తుందన్నది ఆయన క్రూరాలోచన. 

             2019 ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కుండబద్ధలు కొట్టారు. జనసేన పార్టీ అభిమానులూ, జన సైనికులూ ఇందుకే మానసికంగా సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలన్న కోరిక బలంగా ప్రజల్లో కనిపిస్తోంది. అయితే… ప్రజల్లో కొన్ని అపోహల్ని ప్రచారం చేయడం ద్వారా జనసేన అవకాశాలను తగ్గించాలన్నది కూడా ప్రత్యర్ధి పెట్టుబడిదారీ పార్టీలయిన తెలుగుదేశం, వైఎస్సార్సీపీల వ్యూహంగా ఉంది. 

                    విజయవాడ నుంచి అందుతున్న మరో సమాచారం ఏమంటే… జగన్ తో పొత్తు పెట్టుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని కొందరు సీనియర్ నేతలే పాత్రికేయులతో నమ్మబలుకుతున్నారు. పాత్రికేయులకు సమాచారం వచ్చేదే సీనియర్ నేతల నుంచి. సీనియర్ నేతలు కూడా ఇలా మాట్లాడటం వల్ల పాత్రికేయుల్లో కూడా అయోమయం నెలకున్నది. జనసేన మద్దతు ఇస్తానంటే.. తెలుగుదేశం పార్టీ వద్దని ఎందుకు చెబుతున్నది. ఈ రాష్ట్రంలో గెలుపు కోసం ఏం చేయడానికైనా, ఎవరితో కలవడానికైనా చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఉన్న పరిస్థితి అలాంటిది. 

             తెలుగుదేశం పార్టీకి పెట్టుబడులు పెట్టినవారు, దానితో పడుగుపేకల్లా కలిసిపోయి వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకుంటున్నవారు అనేక మంది కోస్తాంధ్ర ధనిక సామాజిక వర్గం వారు ఉన్నారు. వారికి లాభం చేకూర్చాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉన్నది. పేదవారికి నాలుగు రాళ్లు పడేస్తారు. మరో నాలుగు స్కీములు పారేస్తారు. వైఎస్సార్సీపీ అధికారానికి వచ్చినా జరిగేది ఇదే. పేదలకు సేవ చేస్తామన్న పేరుతో ఆంధ్రలో ఉన్న సహజ వనరులను దోచుపెట్టడమే కదా వారు చేసేది. 

        పవన్ కళ్యాణ్ వేరు. జనసేన సిద్ధాంతం వేరు. హక్కులూ, సహజ వనరులూ అందరికీ అందాలని అంటున్నది. ఈ మాట జగన్ మ్యానిఫెస్టోలోగానీ, చంద్రబాబు మ్యానిఫెస్టోలోగానీ ఉండదు. పేదలకు నాలుగు మెతుకులు విసురుతామనే ఉంటుంది. ఇంకా ఎంగిలాకులో మెతుకులు ఏరుకోవడానికి దళిత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు వర్గాల్లోని యువత అందుకు సిద్ధంగా లేరు. మార్పు రావాలని బలంగా కోరుకుంటున్నారు. ఇందుకు విరుద్ధంగా జనసేన అధినేత ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఆయా వర్గాలు మండిపడటం ఖాయం.

                వైఎస్సార్సీపీ మద్దతు కోసం పవన్ ప్రయత్నిస్తున్నాడని, 14 నుంచి 15 సీట్లు అడుగుతున్నారని కూడా లోపాయికారీగా వైఎస్సార్సీపీ నేతలు జర్నలిస్టులతో చెబుతున్నారు. ఈ రోజు సాక్షి కథనం ‘‘పార్టనర్స్ ముసుగు తొలగింది’’ అన్న వార్త… పవన్-చంద్రబాబు లిద్దరూ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నారని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నించింది. ప్రత్యర్థులపై బురద జల్లేందుకు ప్రయత్నించడం ద్వారా అధికారంలోకి రావాలని వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీలు తెగ ప్రయత్నిస్తున్నాయి. 

           ఎవరు ఎవరితో ఉంటే వారికేమిటి అసలు? మీరేమిటో చెప్పుకోవడం, మీరు ప్రజలకు ఏం చేయనున్నరో చెప్పడమే కదా చేయాల్సింది? ఎవరు ఎవరితో అంటకాగుతున్నారో, ఎవరికి రాజకీయ సమాధి కట్టాలో అన్నది ప్రజలకు వదిలివేయండి. స్వార్థంతో ఉన్నవారి పార్టీల సంగతి చూసుకోవడానికి ప్రజలు ఉన్నారు కదా. రెండు మూడు నెలల్లోనే ఏ పార్టీని ఎక్కడ ఉంచాలో వారు నిర్ణయిస్తారు. కంగారు పడకండి. 

              మైండ్ గేమ్ ద్వారా లబ్దిపొందడం తప్ప… స్పష్టమైన ముఖంతో ప్రజల్లోకి వెళ్లాలంటే ముందు ఆయా పార్టీలు స్వార్థాన్ని వీడాల్సి ఉంటుంది. ఆ పనివారు చేయలేరు. డబ్బులుంటే.. పార్టీలు పెట్టేసుకుంటారు. తామే నిజమైన సత్యహరిశ్చంద్రులమని చెప్పుకుంటున్నారు. ప్రజలకు మేలు చేయదగిన మేథావులు ఎందరో ఉన్నారు. వారు పార్టీలు పెట్టలేరు. అందుకే డబ్బున్న వారి రాజకీయాలు నడుస్తున్నాయి. కాంట్రాక్టర్లు కూడా పెట్టుబడిదారీ పార్టీలకే మద్దతు పలుకుతున్నాయి. 

             అవినీతితో బలిసిన రాజకీయ నాయకులు జనసేన వైపు చూడలేరు. నేడు రాజకీయాల్లోకి వస్తున్న వారంతా డబ్బు సంపాదించుకోవడానికి… లేదా అక్రమంగా సంపాదించిన డబ్బును కాపాడుకోవడానికి. అక్రమ సంపాదనను కాపాడుకోవడం అంటే ఒక రాజకీయ పార్టీ అండలో ఉండటం. ఇలాంటి కొందరు బడా భూస్వాములు టీవీ ఛానెళ్లు కూడా పెట్టారు. మీడియా ఉంటే… అధికారులు దాడులు చేయరని వారి నమ్మకం. 

                   కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాహాటీవీ యజమానికిగా ఉన్నా… ఎంపీగా ఉన్నా సుజనా చౌదరి కంపెనీలపై దాడులు చేసింది. దీంతో ఈ పన్నాగం కూడా పని చేయడం లేదు. అందుకే కోస్తాంధ్ర ధనిక వర్గాలు, కోట్లాది రూపాయల వ్యాపారాలున్న పారిశ్రామిక వేత్తలకు మోడీ కంటగింపు అయ్యారు. మీరు అధికారి అయి.. దాడి చేస్తామన్నా ఒప్పుకోరు. వేల కోట్లు ఆస్తులున్న కోస్తాంధ్ర పెట్టుబడిదారులు రాజకీయాలను నడపాలని చూస్తున్నారు. కనీసం ఓట్లు కూడా వేయని… ఈ బడా పారిశ్రామికవేత్తలే ప్రభుత్వాలను తోలుబొమ్మలుగా చేసి ఆడించాలని చూస్తున్నారు. చంద్రబాబు ఈ వర్గం ఆకాంక్షలకు ప్రతినిధి. 

                       రాష్ట్రాలకు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా… వారు కేంద్రానికీ, ఆయా రాష్ట్రాల్లో ఉన్న పెట్టుబడిదారులకూ మధ్య ఒక బ్రోకర్ గా పని చేస్తారని డాక్టర్ బాలగోపాల్ చక్కగా చెప్పారు. పవన్ కళ్యాణ్ వస్తే… ఈ పరిస్థితి ఉండదు. అప్పుడు కూడా సీఎంనే మార్చాలని చూస్తారు. మోడీని మార్చేందుకు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అని చంద్రబాబు అరుస్తున్నది అందుకే. సామాన్య జనం కోసం ఆయన అంటున్నారని అనుకుంటే పొరపాటు. మీడియా అధిపతులు కూడా పెట్టుబడిదారీ వర్గాలే కనుక వారూ ఈ రహస్యాన్ని చెప్పరు.

         కేవలం 2 వేలు పింఛను ఇస్తే సామాన్యుడు సంతోషపడతాడు. పెట్టుబడిదారుడిని సంతృప్తి పరచడానికి రూ.2 వేల కోట్ల ప్రాజక్టు ఇవ్వాలి. మధ్య, దిగువ తరగతి యువత ఇంకా ఎప్పుడు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారు? ఎవరు ఆ సాయాన్ని అందిస్తారు? తెలంగాణ వరకూ చూస్తే… అది విముక్తి పొందినట్లే. తెలంగాణ రావడం వల్ల ఎంత మంది కొత్త రాజకీయ నేతలు వచ్చారు? కొత్త కాంట్రాక్టర్లూ తెలంగాణ గడ్డపై నుంచి వస్తారు.

          ఇవాళ కాకపోతే రేపైనా ఆర్థిక పరిస్థితులు అందరివీ మెరుగుపడతాయి. కానీ పాత రాజకీయ పార్టీలే మంచివి… సరే, ఎవరైతే ఏమిటి..? అనుకున్నారా? ఆంధ్రప్రదేశ్ యువత ఆశలు మళ్లీ మట్టిలో కలిసిపోతాయి. బాబు మళ్లీ రావాలి అన్న పెట్టుబడిదారుల గావుకేకల్ని నెత్తికి ఎత్తుకోకుండా… దళిత, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వనరుల్లో వాటా కల్పిస్తానన్న పార్టీనే ఎంచుకోవడం, తద్వారా మార్పును తేవడం తెలుగు ప్రజల ముందు ఉన్న తక్షణ కర్తవ్యం.


              చంద్రబాబు హృదయంలో జగన్ చెప్పినట్లు పవన్ లేడు. ఆయన మనసంతా కాంగ్రెసుతో నిండిపోయింది. వైఎస్సార్సీపీ కూడా ఆ తానులో ముక్కే కదా. అబద్ధాలను పుంఖాను పుంఖాలుగా తయారుచేసి జనంపై వదిలే యంత్రాలుగా మారిన పత్రికలకూ, టీవీలకూ దూరంగా ఉంటే… మనసు కుదుటపడుతుంది. స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి వీలు చిక్కుతుంది. ఒకటి మురికి కూపం.. మరొకటి యమకూపం. ఈ పెట్టుబడిదారీ పార్టీలను చెత్తబుట్టలో విసిరేయండి. పేదవాడికి పట్టెడన్నం దొరుకుతుంది. యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు లభిస్తుంది.

Comments

Popular posts from this blog

ఐదు రూపాయల డాక్టర్‌ ఇకలేరు

జనసేన గురించి యక్ష ప్రశ్నలు!!

జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి: పవన్ కళ్యాణ్