నన్ను నమ్మి రండి… రేపన్నది మనదే: పవన్ కళ్యాణ్

- చిత్తశుద్ధితో ముందు పని చేయాలి
- ప్రజాసేవే పరమార్థం కావాలి
- పని చేస్తే పదవులు అవే వస్తాయి
- పదవులంటే ఎమ్మెల్యే, ఎంపీలే కాదు
- కులం పేరుతో కొందరికే లబ్ధి
- బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కాలం చెల్లింది
- నేను ప్రవాహం లాంటి వాడిని
- నన్ను ఎవరూ ఆపలేరు
విజయవాడ: ‘‘నన్ను
నమ్మి పార్టీలోకి రండి… కష్టపడి పని చేసే వారందరికీ గుర్తింపు ఇస్తాను’’…
అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులకూ, పార్టీ కార్యకర్తలకూ
భరోసా అందించారు. తూర్పు గోదావరి జిల్లా సమీక్షా సమావేశంలో పవన్
కళ్యాణ్ మాట్లాడారు. పేరు ప్రఖ్యాతులు, డబ్బు ఉన్నంత మాత్రాన పార్టీలు స్థాపించి, వాటిని విజయవంతం చేయలేమని, బాధ్యత, సమాజం కోసం పని చేయాలన్న తలంపు, ఓపిక, సాహసం, ఉన్నప్పుడే
రాజకీయాల్లో రాణిస్తామని యువతకు హితబోధ చేశారు. ఈ లక్షణాలన్నీ
చిన్ననాటి నుంచే తాను అలవర్చుకున్నానని, ఈ దిశగానే రాజకీయాల్లోకి
వచ్చానని అన్నారు.
మనది కులాలతో ముడిపడిన సమాజమని, ఒకటి రెండు
కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో విజయం సాధించలేమని, కులాల
ప్రభావం అధికంగా ఉండే ఉత్తరప్రదేశ్‌లో కూడా కుల రాజకీయ
ప్రయోగాలు విఫలమయ్యాయని, కులం పేరు చెప్పి వ్యక్తులు
లాభపడుతున్నారుగానీ, కులాలు (90 శాతం ప్రజలు) బాగుపడడం లేదని అన్నారు. 2009లో
ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటైన సందర్బంలోని అనుభవాలను దృష్టిలో
పెట్టుకుని జనసేనని తీర్చిదిద్దుతున్నానని చెప్పారు. ‘‘జనసేన పార్టీ
ద్వారా ప్రజలకి సేవ చేయడానికి నిబద్దతతో పని చేస్తున్నాను.
డబ్బు
పెట్టి రాజకీయాల్లో లాభం పొందాలనుకునే వారు ఎక్కువగా ఉన్నారు. సేవ
చేద్దామన్న తలంపు ఉన్నవారు కనుమరుగైపోతున్నారు. ఎదుటి వారిని తిట్టడం
వల్ల, బ్లాక్ మెయిల్ చేయడం వల్ల ముందుకి వెళ్లలేం. సేవ చేసినప్పుడే
ఎవరైనా ప్రగతిపథంలోకి పయనిస్తారు. ఒక పని చేయడానికి బలమైన అనుభవం
కావాలి.
రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలు, ఎంపీలు
అయిపోదాం అనుకుంటే సాధ్యమయ్యే పని కాదు. నన్ను నమ్మి పార్టీలోకి
రండి. పని చేసిన వారికి తప్పుకుండా గుర్తింపు ఇస్తాను. బాధ్యతలు
తీసుకున్న వారికి గుర్తింపు వస్తుంది. గుర్తింపు వస్తే పదవులు వాటంతట
అవే వస్తాయి. పదవులు అనగానే ఎమ్మెల్యే, ఎంపిలు మాత్రమే కాదు. పార్టీ పదవులు ఇస్తాము’’ అని అన్నారు.
పార్టీ
అధికారంలోకి వస్తే అనేక ప్రభుత్వ పదవులు అందుబాటులో ఉంటాయని, పార్టీలో
కష్టపడిన వారికి ఇవన్నీ దక్కుతాయనీ, పార్టీలో పైకి ఎదగాలంటే
సామరస్య ధోరణి అవసరమని, ఘర్షణ పూరిత దృక్పథం కాకుండా ఒకరికి ఒకరు
సహకారం అందించుకున్నప్పుడే విజయం సాధిస్తామని అన్నారు. ‘‘నేను ప్రవాహం
లాంటి వాడిని. నన్ను ఎవరూ ఆపలేరు. పుట్టిన
ప్రతి ఒక్కరు రెండు రకాలుగా మనుగడ సాధించవచ్చు. మొదటిది తనకి
ఇష్టమైన రీతిలో తిని తిరిగి మరణించడం. రెండోది మనతోటి వారికి
సాయపడుతూ సంఘానికి ఉపయోగపడుతూ సేవ చేస్తూ మరణించడం. నాకు రెండోది
ఇష్టం’’ అని తన దృక్ఫథాన్ని వివరించారు.
పార్టీ కోసం పని చేసేవారు
సంతోషంతో చేయాలనీ, సేవాభావంతో పని చేయాలనీ, రాజకీయ ప్రయాణం చేసినప్పుడే
రాజకీయ అనుభవం లభిస్తుందని అన్నారు. అప్పుడే కార్యకర్తల్ని, నేతల్నీ
ప్రజలు ఎన్నికల్లో ఆదరిస్తారని అన్నారు. వ్యక్తిగతంగా రాణిస్తూ
కనీసం 10 వేల ఓట్లు సాధించుకునే సామర్ధ్యం
ఉన్నవారిని పార్టీ తప్పకుండా అక్కున చేర్చుకుంటుందన్నారు. ‘‘మన ముందు
ఎన్నికలు ఉన్నాయి. చాలా తక్కువ సమయం ఉంది. తక్కువ కాలంలో అధిక ఫలాలు
ఎలా సాధించవచ్చో సూచించండి. వాటిని పార్టీ తప్పకుండా స్వీకరించి
ఆచరిస్తుంది’’ అని తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన ఖరారు.
జనసేన
నేత మాజీ స్పీకర్ మనోహర్ నియోజవర్గంలో పర్యటించనున్నారు. పవన్ సంక్రాంతి
పండగ సంబరాల్లో కూడా పాల్గొంటారు. సంక్రాంతి పండుగకు తెనాలి,పెదరావూరు గ్రామంలో సంక్రాంతి వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని పార్టీ వర్గాల సమాచారం. రైతులు, మహిళలతో భేటీ అయ్యి, సమస్యలపై వారితో చర్చిస్తారు.
Comments
Post a Comment