• జనసేనకు రేటు కట్టే మొనగాడు ఎవడు?

  • Janasena | telugu.newsof9.com
  • వైసీపీ….వైఎస్ఆర్ వరమా? లేక పచ్చ పూల వనమా?
  • అసలు “పసుపు” పూసుకున్న నేతలెవరో?!
  • ఆంధ్రను రెండు వాటాలు చేద్దామనే పవన్ పై కుట్ర
అమరావతి: మనిషి నెత్తురు రుచి మరిగిన పులిని ‘‘మాన్ ఈటర్’’ అని అంటాం. మనిషిని చంపి తినడానికి అలవాటుపడిన పులి మళ్లీ మనిషి వాసన కోసం వెదుకుతూ ఉంటుంది. 70 ఏళ్లుగా రాజకీయ అధికారం రుచి మరిగిన ఓ రెండు నల్లటి గండు పిల్లులు, సారీ రెండు సామాజిక వర్గాలు నేటికీ ఈ మాన్ ఈటర్లను తలపిస్తున్నాయి. 70 ఏళ్లుగా కూర్చుని మెక్కి, 90 శాతం మందిని పేదరికంలోనే ఉంచేసిన పాపం కళ్ల ముందు ఇంకా కదలాడుతుంటే… మళ్లీ రాజదండం కోసం…గేమ్స్ అడుతున్నాయి. పేదలకు రాజ్యాధికారం ఇస్తానంటూ వచ్చిన పార్టీని పీక నులిమి చంపేందుకు ప్రయత్నిస్తున్నాయి.

           ఏపీలో ఉన్న రాజకీయ పార్టీల్లో తెలుగుదేశం అవినీతిలో కూరుకుపోగా, వైఎస్సార్సీపీ అధినేత జగన్.. అనేక అవినీతి కేసులను ఇప్పటికే ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు ముగ్గురు స్నేహితులు ఉన్నారని అనుకుందాం. అందులో ఇద్దరికి చెడు వ్యసనాలు ఉంటాయి. పాపం మూడో వాడికి టీ తాగే అలవాటు కూడా లేదు. మిగిలిన ఇద్దరూ తిన్నగా ఉంటారా? మూడో వాడికి కూడా అన్నీ అలవాటు చేసి వాడిని కూడా నైతికంగా పతనం చేసే వరకూ నిద్రపోరు. ఇది మానవ నైజం.

    తెలుగుదేశం, వైఎస్సార్సీపీలు జనసేన విషయంలో సరిగ్గా ఇదే కుట్ర చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పై వారికి ఉన్నట్లుగా అవినీతి మచ్చలేమీ లేవు. చేసేది లేక, మొన్నటి వరకూ వ్యక్తిగత అంశాలను లక్ష్యంగా చేసుకున్నారు.

    తెగించి వచ్చిన వాడికి భయం ఏముంది? తన జీవితాన్ని తెరిచిన పుస్తకంగా తానే చేశాడు. దాచుకోకుండా అన్నీ చెప్పాడు. స్వచ్ఛంగా ప్రజల ముందు నిలబడి ఉన్నాడు. అయినా రాళ్లేస్తున్నారు. అనుమానపు విష బీజాలను నాటుతున్నారు. నాటండి.. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత అందరికీ తెలిసిందే.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసిపోతున్నారనీ, పాతిక అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లకు ఒప్పందం జరుగుతోందనీ, చర్చలు మొదలయ్యాయనీ టముకు వేసింది సాక్షి పత్రిక.‘‘ముసుగులో సర్దుబాట్లు’’ శీర్షికతో పవిత్రమైన శుక్రవారం పూట పరమాన్నం పెట్టాల్సింది పోయి తన పాఠకులకు ‘‘విషాన్నం’’ వడ్డించింది.

సాక్షి, ఈనాడులకు చెరో 10 లక్షలకు పైగానే పాఠకులున్నారు. ఈ రెండు పత్రికలూ పక్షపాతంతో రాస్తున్నవే. అలాగే ఆంధ్రజ్యోతి పత్రిక కూడా. ఈ మూడు పత్రికల్లో వండి వార్చుతున్న వార్తల్ని ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదు. సాక్షి పత్రిక జగన్ సొంత అవసరాల కోసమే పెట్టుకున్నారన్నది ప్రపంచానికి తెలిసిందే. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తెలుగుదేశం కోసం పని చేస్తున్నవే. 

     తెలుగు మీడియాలో… ‘‘అవును. ఫలానా పత్రికలో లేదా ఛానెల్లో వచ్చిన వార్త నిజమే అని గుండెల మీద చెయ్యివేసుకుని చెప్పే వారు ఒక్కరూ లేరు’’ అన్నది నిజం. ప్రాణం పోయిన తర్వాత మనిషి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ప్రజల నమ్మకం కోల్పోయిన తర్వాత మీడియా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇదీ తెలుగు మీడియా పరిస్థితి. మీడియాపై నమ్మకంలేకపోయినా… కొందరు తెలియనివారు నమ్మే అవకాశం అయితే ఉంటుంది.

నిజానికి జనసేనపైనగానీ, పవన్ కళ్యాణ్ పైన గానీ… ఈ మాత్రం కల్లబొల్లి కబుర్లకు నిజమనే ముసుగు కప్పిన ప్రతిసారీ వారు చెబుతున్న మాట… లింగమనేని రమేష్ పేరు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సినిమా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అన్నది తెలిసిందే. నిజానికి సినిమా ప్రపంచం చంద్రబాబు సామాజిక వర్గం గుప్పిట ఉంది. ఎక్కువ మంది అదే సామాజిక వర్గం. తాను రాజకీయ పార్టీ పెట్టినంత మాత్రాన పవన్ తన పాత సంబంధాలను, పరిచయాలను తెంపుకోలేరు. ఆ అవసరం కూడా లేదు. చేసే పనిలో చిత్తశుద్ధి ఉన్నపుడు ఎవరికీ భయపడాల్సింది లేదు.

పవన్ కళ్యాణ్ తన సిబ్బందికి సెల్ ఫోన్లు ఇస్తే… దానిపైనా దుష్ప్రచారం చేశారు. నిమ్న వర్గాలపై డబ్బున్న వర్గాలు… అది తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు… పెద్ద ఎత్తున నెగటివ్ ప్రచారం చేస్తారు. అది వారికి వెన్నతో పెట్టిన విద్య. వాళ్లు కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలను బెదిరించి మరీ కోట్లు కొట్టేయవచ్చు. అది తప్పుకాదు. వైఎస్ ఉన్నప్పుడు బెదిరించి మరీ పెట్టుబడులు పెట్టించారని ఈనాడు పత్రిక టన్నుల కొద్దీ రాసింది.

జనసేన తన పార్టీ ఆఫీసు కట్టుకున్నా… అది లింగమనేనే ఇచ్చి ఉంటాడనీ, పవన్ హెలికాప్టరులో తిరిగితే అది కూడా ఇంకొక నేని ఎవరో ఇచ్చి ఉంటాడనీ ప్రత్యర్థి పెట్టుబడిదారీ పార్టీలు బురద పూసే ప్రయత్నం చేస్తున్నాయి. వీళ్ల ఉద్దేశం ఏమిటి? పవన్… రబ్బరు చెప్పులు వేసుకుని, చంకలో గుడ్డ సంచితో తిరగాలని వీరి ఉద్దేశంగా కనిపిస్తోంది. వారు మాత్రం కోట్లు కోట్లు ఖర్చు చేసి పెద్ద పెద్ద ఆఫీసులు కట్టుకోవచ్చు. 

ఆ మాట కొస్తే, చంద్రబాబు సామాజిక వర్గం వారే కదా నిజానికి సాక్షి పత్రికలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సాక్షిలో పెట్టుబడి పెట్టినపుడు దాన్నేం అనాలి? అది కూడా చంద్రబాబు పెట్టిన పెట్టుబడులే అని ఎందుకు అనకూడదు?
తెలుగుదేశం, వైసీపీల ఉద్దేశం సుస్పష్టం. గురివిందకు కింద ఉన్న నలుపు కనిపించదని సామెత. సభ్య సమాజం చూస్తుండగా… చంద్రబాబు సామాజిక వర్గాన్ని పార్టీలో చేర్చుకున్నది ఎవరు? ఇపుడు తెలుగుదేశం వారితో దగ్గర సంబంధం ఎవరికి ఉన్నట్లు జగన్ గారూ…? మీకా… పవన్ కళ్యాణ్ కా…?
ప్రజలకు అర్థం కాదని అనుకుంటున్నారా? చంద్రబాబు సామాజిక వర్గాన్నీ, తెలుగుదేశం వర్గాన్నీ మీ వైసీపీ పొత్తిళ్లలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ కంట్లో నలుసు ఉందని ఎందుకు ఈ హంగామా?

అక్కడ దాకా ఎందుకు?
చంద్రబాబు తోడు అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వయంగా మీ చంకలోనే ఉన్నారుగా!! ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి మీ పార్టీలోనే ఉన్నారుగా!! అక్కినేని నాగార్జున మీ వ్యాపార స్నేహితుడు కదా!! ఆయన కూడా వస్తున్నారు కదా!! టీడీపీ వాళ్ళను అంతమందిని వైసీపీలో పెట్టుకుని జనసేనకీ, టీడీపీకీ అక్రమ సంబంధం అంటారేమిటి? దొంగలు మీ దొడ్లో ఉంటే వేలు ఇటు చూపిస్తారేమిటి? ఇద్దరూ కలిసి జనసేనను చంపేస్తే… అడిగే వాడి బాధ తప్పుతుంది. ఆంధ్ర బంగారు బాతును రెండు ముక్కలుగా కోసుకుని తినేద్దామనేగా!!

ఈ నంగనాచి కబుర్లు ఎవరికి చెబుతారు?
మీ ఉద్దేశం ఏమంటే… దోసెడు బురద తెచ్చి పోస్తే… కొద్దిగా అయినా ఆ బురద పవన్ కళ్యాణ్ తెల్ల చొక్కాలోకి ఇంకిపోదా అన్నది మీ ఆపేక్ష. దీనిని మేం అర్థం చేసుకోగలం. తప్పు చేసే వారిని క్షమించమని మీరు నమ్మిన బైబిలు చెబుతున్నది.

విఖ్యాత నాటక రచయిత షేక్ స్పియర్- ఒక నాటకం రాశారు. దాని పేరు ఒథెల్లో.
ఒథెల్లో పెద్ద వీరుడు. అప్పుడే యుద్ధంలో గెలిచి ఇంటికి వస్తాడు. ఒథెల్లోని బలహీన పరచడానికి అతని పక్కన స్నేహితుడుగా ఉన్నవాడే… పరాయి పురుషుడి రుమాలు (కర్చీఫ్) తెచ్చి ఒథెల్లో బెడ్ రూములో వదులుతాడు. యుద్ధంలో శత్రువులను తెగటార్చిన అంత వీరుడినీ రక్తం చుక్క కింద పడకుండా ఆ చిన్న రుమాలుతో జయిస్తాడు వెన్నుపోటుదారుడు. అనుమానంతో తన భార్యను శత్రువులను తెగనరికిన ఆ కత్తికే బలి ఇస్తాడు ఒథెల్లో. కుట్రలు ఇలా ఉంటాయని చెప్పడానికే ఈ ఉదాహరణ.

 అంతెందుకు రాముడి విషయంలోనూ ఇదే జరిగింది కదా. ఎవడో అనామకుడు అన్న మాటకు సీతను అగ్నిపరీక్షకు గురిచేస్తాడు రాముడు. అనుమానపు బీజాలను జయించడం కష్టం. అందుకే మీరు ఇదే మార్గంలో పవన్ కళ్యాణ్ పై అనుమానపు బీజాలను ప్రజల్లో నాటుతున్నారు.

పవన్ వేరు. పవన్ మాన్యుఫ్యాక్చరింగ్ వేరు. ఆ మట్టి వాసన వేరు. అందులో సుగంధ సమధుర పరిమళాలు నేడు లేవు. ప్రజారాజ్యంతో.. జరిగిన అలనాటి అవమానాల కసి అతనిలో పరవళ్లు తొక్కుతోంది. ఆ కసి ఎవరి కోసమో, దేని కోసమే మీకు తెలుసు.

పవన్ కళ్యాణ్ కు రేటు కట్టే మొనగాడు ఇంకా పుట్టలేదు. జన సైనికులకు రేటు కట్టే బ్రోకర్ ఎవడూ లేడు. ఒక వేళ అలాంటి ప్రయత్నం ఎవరైనా నిజంగా చేస్తే… వారిని ఏం చేయాలన్నది జనసైనికులు చూసుకుంటారు. వారిపై ప్రజలకు నమ్మకం ఉంది. సత్యమేవ జయతే!!

Comments

Popular posts from this blog